Pragyan Ojha : భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఎంత కూల్‌గా ఉంటాడో తెలిసిందే. మైదానంలోపలా, మైదానం బయటా ప్రశాంతంగ కనిపించే అతడు క్రమశిక్షణ విషయంలో రాజీ పడడు. టీమిండియా కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ వైఖరి అలానే ఉండేది. అంతేకాదు కెప్టెన్సీ చేపట్టడానికి ముందు కూడా ఈ వాల్ సమయపాలనలో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు. జట్టులో సీనియర్‌గా కొత్త కుర్రాళ్లకు టైమింగ్ అలవాటు చేసేవాడు. అయితే.. ఒకానొక సందర్భంలో ద్రవిడ్ తనతో పాటు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్‌లను హోటల్ బయట ఎండలో పరిగెత్తించాడని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా(Pragyan Ojha) వెల్లడించాడు.
‘రోహిత్, యువరాజ్, నేను అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాం. శ్రీలంక పర్యటనకు సీనియర్లు సచిన్, అనిక్ కుంబ్లే, గంగూలీ, ద్రవిడ్‌లతో కూడిన జట్టులో మా ముగ్గురికి చోటు దక్కింది. ఈ టూర్ సమయంలోనే ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నేను, యూవీ, రోహిత్ కలిసి భోజనం చేసేవాళ్లం. అయితే.. ఒక రోజు మీల్స్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం. దాంతో, ఆగ్రహించిన ద్రవిడ్ మా ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చాడు. హోటల్ బయట ఉన్న ఖాళీ స్థలంలో మమ్మల్ని పరుగెత్తించాడు’ అని ఓజా వివరించాడు.
ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన ఓజా ఫస్ట్ క్లాస్‌లో అదిరిపోయే ప్రదర్శనతో 2008లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 113 వికెట్లు తీసిన అతడు.. 6-47తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 7 పర్యాయాలు ఐదేసి వికెట్లు తీసిన ఓజా.. ఒకే ఒకసారి 10 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఓజా 2009లో టైటిల్ గెలుపొందిన దక్కన్ ఛార్జర్స్(Deccan Chargers) జట్టులో సభ్యుడు. ప్రస్తుతం ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్లో కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు.