హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ పోరులో హైదరాబాద్ అదరగొడుతున్నది. జింఖానా మైదానంలో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న గ్రూపు-డీ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది. ఓవర్‌నైట్ స్కోరు 415/4తో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్..హిమతేజ(171), ప్రజ్ఞయ్‌రెడ్డి(126) సెంచరీలతో 631 పరుగులకు ఆలౌటైంది. ప్రజ్ఞయ్‌రెడ్డి, హిమతేజ..చత్తీస్‌గఢ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ పరుగులు కొల్లగొట్టారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లోయార్డర్ బ్యాటర్లతో కలిసి ప్రజ్ఞయ్ కీలక పరుగులు జతకలిపాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన చత్తీస్‌గఢ్ ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. చత్తీస్‌గఢ్ ఇంకా 248 పరుగుల వెనుకంజలో ఉన్నది.