సిడ్నీ: గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి అలిస్సా హిలీ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం కంటే దృష్టిసారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపింది. ‘క్రికెట్.కామ్.ఏయూ’తో హిలీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఆడటం సరికాదు. ఆ దేశంలో ప్రజలు సాయం కోసం అర్థిస్తున్న తరుణంలో వారి దగ్గరకు వెళ్లి ఉన్న వనరులనూ వాడుకోవడం సమంజసం కాదు. ప్రస్తుత పరిస్థితులలో అక్కడ క్రికెట్ టోర్నీ నిర్వహణ కంటే దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీదే తుది నిర్ణయం’ అని తెలిపింది.