ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7 ముగిసి 795 రోజులైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పూర్తిగా రద్దయిన ఈ లీగ్.. మళ్లీ ఈరోజు (బుధవారం) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రొ కబడ్డీని మిస్ అయిన అభిమానుల ఆకలి తీర్చేందుకే అన్నట్లు సీజన్ 8 తొలి రోజే మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరోనా భయంతో ఈ మ్యాచులు అన్నింటినీ కూడా బెంగళూరులోని షెరటాన్ గ్రాండ్లో బయోబబుల్ వాతావరణంలో జరగనుంది.
ఈ సీజన్ తొలి మ్యాచ్ యు-ముంబా, బెంగళూరు బుల్స్ మధ్య జరగనుంది. సీజన్ 7లో అత్యధిక పాయింట్లు సాధించిన పవన్ సెహ్రావత్.. బెంగళూరు బుల్స్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. గత సీజన్లో రెండు సార్లు ఈ జట్లు తలపడగా.. రెండు సార్లు కూడా విజయం బెంగళూరునే వరించింది.
ఇక రెండో మ్యాచ్ తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరగనుంది. గత సీజన్లో ఈ జట్లు రెండూ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈసారి ఆ ఫలితం రిపీట్ కాకూడదనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్లో ఈ జట్లు రెండుసార్లు తలపడగా తొలిసారి తలైవాస్ గెలుపొందారు. రెండోసారి తలపడిన మ్యాచ్‌లో టైటాన్స్ పగతీర్చుకున్నారు.
మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడనుంది. ఇటీవల జరిగిన ఆక్షన్‌లో తమ జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లందర్నీ బెంగాల్ రిటైన్ చేసుకోగలిగింది. అదే సమయంలో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) చరిత్రలో రెండుసార్లు ఎంవీపీ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్)గా నిలిచిన పర్దీప్ నర్వాల్‌ను యూపీ యోధ సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. మరి ఈ జట్ల మధ్య పోరు ఏ రేంజ్లో ఉంటుందో చూడాల్సిందే.