లాహోర్: చాంపియన్స్ ట్రోఫీని ఈసారి పాకిస్థాన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ ప్రారంభోత్సవ వేడుక ఫిబ్రవరి 16వ లేదా 17వ తేదీన నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ ఓపెనింగ్ సెర్మనీ ఈవెంట్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరవుతాడన్న నమ్మకం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కెప్టెన్ల ఫోటోషూట్ కోసం ఐసీసీ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్లు పీసీబీ తెలిపింది. కరాచీలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభంకానున్నది. అయితే ఇండియా తన మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా ఆడనున్నది. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఇండియా ఫస్ట్ మ్యాచ్‌లో తలపడనున్నది. ప్రీ టోర్నీ ఈవెంట్లకు హాజరయ్యే కెప్టెన్లు, ఆటగాళ్లు, టీం అధికారులకు వీసా జారీ చేసేందుకు అన్ని క్లియరెన్సులు ఉన్నట్లు పీసీబీ తెలిపింది. దీని ఆధారంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు పీసీబీ అధికారి తెలిపారు. వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఆధారంగా ఓపెనింగ్ సెర్మనీ తేదీ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.