PCB : బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో చిత్తుగా ఓడిన పాకిస్థాన్(Pakistna) జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన పాక్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. రావల్పిండి టెస్టు (Rawalpindi Test)లో ఓటమిపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) మీడియా వేదికగా గట్టిగానే స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ గాడిలో పడాలంటే చిన్న సర్జరీ సరిపోదని, పెద్ద మరమ్మతు చేయాల్సి ఉందని నఖ్వీ అభిప్రాయపడ్డాడు.
‘పాకిస్థాన్ క్రికెట్లో నెలకొన్న సమస్యలను నేను పరిష్కరిస్తాను. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. జట్టులో భారీ మార్పులు చేయబోతున్నాం. పాక్ జట్టుకు మొదట్లో నేను చిన్న సర్జరీ అవసరం అనుకున్నా. కానీ, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆటగాళ్ల చెత్త ప్రదర్శన చూశాక పెద్ద మార్పులే చేయాల్సిన అవసరం ఉందని అర్ధమైంది’ అని నఖ్వీ వెల్లడించాడు. అయితే మాజీ ఆటగాళ్లు రమిజ్ రాజా, మహ్మద్ హఫీజ్‌లు పాకిస్థాన్ జట్టుకు చచ్చేంత వరకూ సర్జరీ జరుగుతూనే ఉండాలి అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
PCB Chairman Mohsin Naqvi’s press conference at Gaddafi Stadium, Lahore 🏏#𝐃𝐢𝐬𝐜𝐨𝐯𝐞𝐫𝐢𝐧𝐠𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 pic.twitter.com/YQOUNcEPlg
— Pakistan Cricket (@TheRealPCB) August 26, 2024
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌లు ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ ఆజాం సారథ్యంలోని పాక్ తీవ్రంగా నిరాశపరిచింది. టీమిండియా చేతిలో 7 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అప్పుడు కూడాf పీసీబీ చీఫ్.. పాక్ జట్టుకు చిన్నసర్జరీ అనివార్యమని.. అప్పుడే అంతా సెట్ అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
స్వదేశంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లా.. పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
మొదటి ఇన్నింగ్స్‌లో తొందరపడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. పాక్ జట్టులో అందరూ చేతులెత్తేయగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మహ్మద్ రిజ్వాన్ (51) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.