Naomi Osaka : పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ పరిచిన జపాన్ కెరటం నవామి ఒసాకా(Naomi Osaka) గ్రాండ్‌స్లామ్ వేటకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో మూడో ట్రోఫీపై గురి పెట్టింది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగుతున్న ఒసాకా నలుపు రంగు డ్రెస్‌లో సందడి చేయనుంది. ఈ టోర్నీలో ఆడేందుకు బ్లాక్ డ్రెస్‌ను ఎంచుకోవడానికి బలమైన కారణం ఉందని ఈ జపాన్ క్రీడాకారిణి చెప్పింది.
నలుపు రంగు దుస్తుల్లో తనను తాను ‘నల్ల చిరుత'(Black Panther)లా ఊహించుకుంటానని ఆమె అంది. ‘నా వరకైతే నలుపు అనేది బలానికి సంబంధించింది. పైగా నాకు బాగా నప్పే రంగు కూడా. నాకు ఆకుపచ్చ రంగు అన్నా ఇష్టమే. ఆ కలర్ నాకు ప్రశాంతత, మనోధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతాను. రంగులు మనకు శక్తిని ఇస్తామని భావిస్తా. ఒక నలుపు విషయానికొస్తే.. ఈ రంగు కొంతవరకూ ప్రత్యర్థులను భయపెట్టేందుకు పనికొస్తుంది’ అని ఒసాకా వెల్లడించింది.
ఇప్పటివరకూ ఒసాకా రెండు పర్యాయాలు యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. తొలిసారి 2018లో ఈ గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడిన ఆమె ఆ తర్వాత రెండేండ్లకు మరోసారి ట్రోఫీని అందుకుంది. ఈసారి కూడా ఒసాకా ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ఆమె జెలెనా ఓస్టపెంకోతో తలపడనుంది.