కరాచీ/న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోవల్సి వస్తుందని పేర్కొన్న ఐసీసీ తాజాగా పీసీబీకి మరోమారు హెచ్చరికలు పంపింది.
ఆర్థిక పరంగానే కాకుండా మ్యాచ్ బహిష్కరించిన కారణంగా ఏర్పడే నష్టంపై ప్రసారదారులు పీసీబీపై కోర్టుకు వేళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వార్షిక ఆదాయం కింద వచ్చే రూ.3,161 కోట్ల నుంచి బ్రాడ్కాస్టర్లకు చెల్లించే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే జరిగే పరిణామాలపై గత వారమే బోర్డు న్యాయ నిపుణులతో భేటీ అయిన తర్వాతనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పీసీబీ చీఫ్ మోహిసిన్ నఖ్వి కలిసినట్లు సమాచారం. ‘ఈనెల 7 నుంచి మొదలయ్యే మెగాటోర్నీలో భారత్‌తో పాక్ ఆడకపోతే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఆర్థిక పరంగానే కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు, వార్షిక ఆదాయంలో కోత లాంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది. తాము కోల్పోయే ఆదాయంపై అధికారిక స్పాన్సర్ జియో హాట్‌స్టార్.. పీసీబీపై కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వివాదంపై వివాదాల పరిష్కార కమిటీ(డీఆర్సీ)ని సంప్రందించినా పీసీబీకి నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ బోర్డులో మెజార్టీ సభ్యదేశాల నిర్ణయాన్ని డీఆర్సీ సవాలు చేసే చాన్స్ లేకపోవడమే దీనికి కారణం’అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్‌లో ఈనెల 12న జరిగే సాధారణ ఎన్నికల తర్వాత పీసీబీ చీఫ్ మోహిసిన్ నఖ్వి యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.