Paralympics | పారిస్: ఫ్యాషన్ నగరి పారిస్‌లో మరో ప్రపంచ క్రీడా సంబరానికి అట్టహాసంగా తెరలేచింది. గతానికి పూర్తి భిన్నంగా పారిస్ నడిబొడ్డున జరిగిన పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అభిమానులను కట్టిపడేశాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30లకు మొదలైన కార్యక్రమాలు ఆసాంతం అందరినీ అలరించాయి. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రముఖ అర్టిస్టిక్ డైరెక్టర్ థామస్ జాలీ సారథ్యంలో పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలను తీర్చిదిద్దారు. చాంప్స్ ఎలీస్ నుంచి మొదలైన ఓపెనింగ్ సెర్మనీ..ప్యాలెస్ డీ లా కాన్కోర్డ్ వరకు సాగింది. గత సంప్రదాయలకు భిన్నంగా స్టేడియం లోపల కాకుండా ఈసారి ఆరు బయట ప్రేక్షకుల సమక్షంలో అథ్లెట్ల పరేడ్ కొనసాగింది.
తొలుత ఫ్రాన్స్ పారా అథ్లెట్లు ‘వెల్కమ్ టు పారిస్’ అంటూ వివిధ దేశాల అథ్లెట్లకు సాదర స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుల్ మక్రాన్, అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు అండ్రూ పార్సన్స్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పారాలింపిక్స్ మస్కట్ పిర్జీ బొమ్మలతో అందంగా తీర్చిదిద్దిన కారులో దిగ్గజ ఫుట్‌బాలర్ జినేదిన్ జిదాన్తో పాటు స్విమ్మర్ థియో కురిన్ ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్రాన్స్ వాయుసేన ఆధ్వర్యంలో తమ దేశ జాతీయ పతాక రంగుల్లో ఆకాశంలో చేసిన విన్యాసం కట్టిపడేసింది.
అఫ్గానిస్థాన్‌తో మొదలై: ఫ్రాన్స్ అక్షర్ క్రమాన్ని అనుసరిస్తూ తొలుత పారా అథ్లెట్ల పరేడ్ అఫ్గానిస్థాన్‌తో మొదలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు వరుస క్రమాన్ని అనసరించింది. సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్..జాతీయ పతాకధారులగా వ్యవహరించారు.