Paris Olympics | పారిస్: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవడంతో ఈ ఎడిషన్‌లో అయినా సాక్షాత్కారమవుతుందనుకున్న ‘డబుల్ డిజిట్’పై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్ భారీగా పతకాలు ఆశించిన ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లో మన క్రీడాకారులు దారుణంగా విఫలమవ్వగా షూటింగ్లో మను భాకర్ పుణ్యమా అని మూడు పతకాలు వచ్చాయి. అవి కూడా కాంస్యాలే. అథ్లెట్లు అయితే కనీసం క్వాలిఫికేషన్ రౌండ్లు కూడా దాటడం లేదు. హాకీలో ఇంకా పతకం ఖాయం కాకున్నా మనోళ్ల జోరు చూస్తే కచ్చితంగా మెడల్‌తోనే తిరిగొస్తారన్న అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ ‘రెండంకెల పతకాల’ లక్ష్యాన్ని సాధించాలంటే రెజ్లర్లు ఓ పట్టు పట్టాల్సిందే. ఒలింపిక్స్‌లో సోమవారం నుంచే రెజ్లింగ్ పోటీలు మొదలుకాబోతున్నాయి. తొలి రోజు నిషా దహియా, వినేశ్ పొగాట్, అంతిమ్ పంగల్ వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు. రెజ్లింగ్‌లో భారత్‌కు గత నాలుగు ఎడిషన్లుగా మన మల్లయోధులు పతకాలు తీసుకురాగా పారిస్‌లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని యావత్ దేశం వేయి కండ్లతో వేచి చూస్తోంది.