భారత బల్లెం వీరుడు నీరజ్‌చోప్రా..పతక వేటకు దిగాడు. తాను పోటీకి దిగనంత వరకే..! ఒక్కసారి అడుగుపెడితే పతకం పక్కా అన్న రీతిలో పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ అదరగొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ తన తొలి ప్రయత్నంలో ప్రత్యర్థులు ఇక కాస్కోండి అంటూ హెచ్చరికలు పంపాడు. వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో బరిసెను 89 మీటర్ల దూరం విసిరి ఔరా అనిపించాడు. ప్రత్యర్థులు కనీసం అతని దరిదాపులను కూడా అందుకోలేకపోయారు. గురువారం జరిగే ఫైనల్లోనూ ఇదే రీతిలో బరిసెను విసిరితే భారత్ స్వర్ణ సంబురం సాకారమైనట్లే.
Paris Olympics | పారిస్: ఎవరి అంచనాలకూ అందకుండా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన ‘బల్లెం వీరుడు’ నీరజ్ చోప్రా ‘పారిస్’లో దానిని నిలబెట్టుకునేందుకు వేట మొదలుపెట్టాడు. మంగళవారం ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో ఈటెను 89.34 మీటర్లు విసిరిన అతడు అగ్రస్థానంతో ఫైనల్స్‌లో ఘనంగా అడుగుపెట్టాడు. ఈ సీజన్లో నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా మొత్తంగా రెండో (2022లో 89.94 మీటర్లు)ది. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఏ లో జర్మన్ అథ్లెట్ వెబర్ జులియన్ 87.76 మీటర్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గ్రూప్-బీతో పాటు రెండు గ్రూపులలోనూ నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన.
ఓవరాల్‌గా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (88.63 మీటర్లు), వెబర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 86.59 మీటర్లతో 4వ స్థానంలో నిలిచాడు. అర్హత రౌండ్స్‌లో జావెలిన్‌ను 84 మీటర్లు దాటినవాళ్లు ఫైనల్స్‌కు వెళ్తారు. రెండు గ్రూపులలో కలిసి ఫైనల్స్‌కు 12 మంది క్వాలిఫై అయ్యారు. భారత్‌కే చెందిన కిషోర్ జెన 80.73 మీటర్లతో క్వాలిఫికేషన్ రౌండ్స్‌లోనే తేలిపోయాడు.