Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనుకున్న ఓ స్మిమ్మర్ కల చెదిరింది. ఆదివారం పూట బాయ్‌ఫ్రెండ్‌తో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లిన ఆమెకు ఒలింపిక్స్ నిర్వాహకులు షాకిచ్చారు. విశ్వ క్రీడల నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ సదరు స్విమ్మర్‌పై నిషేధం విధించారు. దాంతో, ఒలింపిక్స్‌లో పతకంతో మురిసిపోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. అసలేం జరిగిందంటే..?
బ్రెజిల్‌కు చెందిన స్విమ్మర్ అనా కరోలినా వియెర(Ana Carolina Vieira) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లింది. అతడి పేరు గాబ్రియెల్ సాంటోస్(Gabriel Santos). స్విమ్మర్ అయిన అతడు కూడా ఒలింపిక్ మెడల్ కోసమే పారిస్ వచ్చాడు. అయితే.. ప్రియుడితో జాలీగా తిరిగొద్దామని ఆదివారం కరోలినా విలేజ్ నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఒలింపిక్స్ నిర్వాహకులు కరోలినా గోల్డెన్ రూల్‌ను బ్రేక్ చేసిందని ఫిర్యాదు చేశారు.
దాంతో, ఒలింపిక్ క్రమశిక్షణ కమిటీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది. ఈత పోటీల్లో పాల్గొనకుండా కరోలినాపై నిషేధం విధించింది. దాంతో, బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ సైతం కరోలినా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోలినా తీరు అమర్యాదకరంగా, కోపం తెప్పించే విధంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆ స్విమ్మర్ తానొకటి తలిస్తే.. మరొకటి జరిగిందంటూ వాపోతోంది.