Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైక భారత రోవర్ బాల్‌రాజ్ పన్వర్ (Balraj Panwar) సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి రెపిచేజ్ రౌండ్ (Repechage round) కు అర్హత సాధించిన బాల్‌రాజ్ పన్వర్.. ఇప్పుడు రెపిచేజ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెపిచేజ్ రౌండ్ పోటీలు జరిగాయి. ఇందులో బాల్‌రాజ్ 7:12.41s టైమింగ్‌తో బాల్‌రాజ్ రేసును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. మొనాకోకు క్వింటన్ ఆంటోగ్నెల్లి 7:10.00s టైమింగ్‌తో అగ్ర స్థానం దక్కించుకున్నాడు. రేసులో కొంత సేపు ముందంజలో కొనసాగిన పన్వర్.. చివరికి రెండో స్థానంతో ముగించాడు.
కాగా హీట్స్‌లో తొలి మూడు స్థానాల్లో రోవర్స్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నాలుగు స్థానంలో నిలిచిన రోవర్‌కు రెపిచేజ్ రౌండ్ ద్వారా క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లేందుకు మరో అవకాశం కల్పిస్తారు. అవిధంగా బాల్‌రాజ్ పన్వర్ రెపిచేజ్ రౌండ్ ద్వారా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రతి రిపిచేజ్ రౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్స్‌కు వెళ్తారు.
భారత సైన్యంలో పనిచేస్తున్న బాల్‌రాజ్ పన్వర్ దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్, ఓసియానియన్ రోయింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.