Paris Olympics | పసిడి పతకమే లక్ష్యంగా ఒలింపిక్స్ బరిలో నిలిచిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి రౌండ్లోనే తన పంచ్ పవర్‌తో అదరగొట్టింది. మహిళల 50 కిలోల విభాగంలో నిఖత్.. 5-0తో మ్యాక్సీ కరీనా క్లొయెట్జర్ (జర్మనీ)ను మట్టికరిపించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె చైనా బాక్సర్ వు యు తో తలపడనుంది.
భాకర్ పతకమిచ్చిన స్ఫూర్తితో సహచర షూటర్లు రమిత జిందాల్, అర్జున్ బబుతా తమ తమ విభాగాల్లో ఫైనల్‌కు అర్హత సాధించి ఔరా అనిపించారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రమిత 631.5 పాయింట్లతో ఐదో స్థానంతో ఫైనల్ పోరులో నిలిచింది. సోమవారం జరిగే తుది ఫైట్‌లో రమిత తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో షూటర్ ఎలావెనిల్ వాలరివన్(630.7) 10వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో అర్జున్ బబుతా(630.1) ఫైనల్‌కు అర్హత సాధించి పతక పోరులో నిలిచాడు. ఇదే కేటగిరీలో పోటీకి దిగిన మరో యువ షూటర్ సందీప్‌సింగ్(629.3) 12వ స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించలేకపోయాడు.
ఒలింపిక్స్‌లో తొలి రోజు ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమైన భారత్ రెండో రోజు మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ఆదివారం సత్తా చాటారు. షూటింగ్లో మను భాకర్.. ఈ క్రీడలో ఇంతవరకూ మహిళలకు దక్కని గౌరవాన్ని దేశానికి తొలి పతకాన్ని అందించి శుభారంభం చేయగా తమ క్రీడలలో పోటీపడ్డ ఇతర మహిళా అథ్లెట్లు సైతం గెలిచి తదుపరి రౌండ్స్‌కు దూసుకెళ్లారు. తెలుగు అమ్మాయిలు పీవీ సింధు, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజతో పాటు మనికా బాత్రా, రమిత జిందాల్ విజయనాదాలు చేశారు. షూటింగ్లో సోమవారం రమిత జిందాల్ సైతం మెడల్ ఈవెంట్‌కు దూసుకెళ్లి పతక ఆశలు రేపుతోంది. అయితే మహిళల ఆర్చరీ జట్టు నిరాశపరచింది.
ర్యాంకింగ్ రౌండ్లో అదరగొట్టి నాలుగో స్థానంతో ముగించి క్వార్టర్స్ చేరిన భారత మహిళల ఆర్చరీ జట్టు కీలకపోరులో చేతులెత్తేసింది. దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత భకత్‌తో కూడిన భారత్.. 0-6 (51-52, 49-54, 48-53) తో నెదర్లాండ్స్ చేతిలో పరాభవం పాలైంది.
భారత టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నాగల్ ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాగల్ 2-6, 6-4, 5-7తో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్) చేతిలో పరాభవం పాలయ్యాడు. రెండున్నర గంటల పాటు గిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో ఓడినా తర్వాత పుంజుకున్న నాగల్.. మూడో సెట్లోనూ ఓడాడు.
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనికా బాత్రా తదుపరి రౌండ్‌కు ముందంజ వేయగా ఈ ఒలింపిక్స్‌లో భారత పతాకధారి అయిన వెటరన్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్-64లో శ్రీజ 4-0 (11-4, 11-9, 11-7 11-8)తో క్రిస్టియానా కల్బర్గ్ (స్వీడన్)ను ఓడించి ఏకపక్ష విజయాన్ని నమోదుచేసింది. మరో పోరులో మనిక 4-1 (11-8, 12-10, 11-9, 9-11, 11-5)తో అన్నా హర్సే (బ్రిటన్)ను ఓడించింది. కానీ ఐదో ఒలింపిక్స్ ఆడుతున్న శరత్ కమల్ 2-4 (12-10, 9-11, 6-11, 7-11, 11-8, 10-12) తో డెని కొజుల్ (స్లోవేనియా) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత, ఈసారి పతకం రంగు మార్చాలని బరిలోకి దిగిన తెలుగమ్మాయి పీవీ సింధు పారిస్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-9, 21-6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవులు) పై ఏకపక్ష విజయం సాధించింది. 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో నెగ్గిన సింధు.. బుధవారం ఈస్తోనియా అమ్మాయి క్రిస్టిన్‌తో తలపడనుంది. సింధుతో పాటు మరో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రణయ్.. 21-18, 21-12తో ఫాబియన్ రొత్ (జర్మనీ)ను చిత్తు చేసి శుభారంభం చేశాడు. 45 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో 18-21, 10-21తో కొరియన్ ద్వయం కొంగ్ హి యాంగ్, కిమ్ సొ యీంగ్ చేతిలో ఓడారు.
ఒలింపిక్స్ బరిలో ఉన్న ఏకైక రోయర్ బాల్‌రాజ్ పన్వర్ పురుషుల సింగిల్స్ స్కల్స్ ఈవెంట్లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శనివారం ముగిసిన ఈవెంట్లో నాలుగో స్థానంతో నిరాశపరిచినా ఆదివారం జరిగిన రెపిచేజ్ 2లో 7 నిమిషాల 12.41 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మంగోలియా రోయర్ క్వెంటిన్ రెండో స్థానంలో నిలిచాడు. స్విమ్మింగ్‌లో భారత పోరాటం ముగిసింది. పారిస్ బరిలో నిలిచిన శ్రీహరి నటరాజ్, దినిది సెమీస్ చేరడంలో విఫలమయ్యారు. వంద మీటరర్ల పురుషుల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌ను 55.01 సెకన్లలో పూర్తిచేసిన నటరాజ్ 33వ స్థానంలో నిలిచాడు. 14 ఏండ్ల వయసులో ఒలింపిక్స్ ఆడుతున్న దినిది.. 200 మీటర్ల మహిళల ప్రీస్టయిల్ హీట్‌లో 23వ స్థానంతో సరిపెట్టుకుంది.