Rishabh Pant : సుదీర్ఘ ఫార్మాట్లో రిషభ్ పంత్ (Rishabh Pant) ఆట ఓ రేంజ్లో ఉంటుంది. బజ్‌బాల్‌ను తలదన్నే విధ్వంసం అతడి సొంతం. విదేశీ గడ్డపై పరుగుల వరద పారించే పంత్ ఇప్పటికే పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు ఇప్పుడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఘనతపై గురి పెట్టాడు. మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కళ్లు చెదిరే రీతిలో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఈ వికెట్ కీపర్.. 90 సిక్సర్లతో వీరూ రికార్డును సమం చేశాడు.
తొలి రోజు కుడి పాదానికి గాయంతో మైదానం వీడిన పంత్.. శార్దూల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ ఓవర్లో లెగ్ సైడ్ బంతిని సిక్సర్‌గా మలిచిన అతడు సెహ్వాగ్ తర్వాత 90వ సిక్సర్ బాదిన రెండో భారతీయుడిగా అవతరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరొక్కటి కొట్టాడంటే భారత్ తరఫున ఈ ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల వీరుడిగా పంత్ పేరు రికార్డు పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.
Rishabh Pant hits his 90th Test six, equalling Virender Sehwag’s India record! 💥 pic.twitter.com/1Z6WjIXYrp
— ESPNcricinfo (@ESPNcricinfo) July 24, 2025
ఎందుకంటే.. అతడికి దరిదాపుల్లో ఎవరూ లేరు. సెహ్వాగ్ ఎప్పుడో వీడ్కోలు పలకగా.. ఈ ఏడాదే రోహిత్ శర్మ (88 సిక్సర్లు), మాజీ సారథి ఎంఎస్ ధోనీ( 78 సిక్సర్లు) సైతం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం 74 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా ఇంకెన్ని రోజులు ఆడుతాడో చెప్పలేం. ఒకవేళ జడ్డూ వచ్చే ఏడాది వరకూ ఆడినా.. పంత్‌ను అందుకోలేడు. సో.. టెస్టుల్లో ‘స్పైడీ’ ఫీట్‌ను బీట్ చేసే ఇండియన్ ఉండరేమో.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో వీరవిహారం చేస్తున్న పంత్ అసాధ్యమనుకున్న రికార్డులను తన వశం చేసుకుంటున్నాడు. మాంచెస్టర్ టెస్టులో హాఫ్ సెంచరీతో ఒకే సిరీస్‌లో అత్యధికంగా ఐదు పర్యాయాలు ఈ ఫీట్ సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు పంత్. ఫారుక్ ఇంజనీర్, ఎంఎస్ ధోనీలు నాలుగు అర్థ శతకాలతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఫారుక్ 1972-73 పర్యటనలో ఇంగ్లండ్‌పైనే ఫిఫ్టీల మోత మోగించాడు. మహీ భాయ్ రెండుసార్లు నాలుగేసి హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియా(2008-09), ఇంగ్లండ్(2014)కు దడ పుట్టించాడు.