Bay Leaves Water | బిర్యానీ ఆకుల గురించి అందరికీ తెలిసిందే. మసాలా వంటకాలను వండినప్పుడు వీటిని ఎక్కువగా వేస్తుంటారు. బిర్యానీల్లోనూ వాడుతారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. బిర్యానీ ఆకులనే తేజ్ పత్తా అని హిందీలో పిలుస్తారు. ఆయుర్వేద ప్రకారం ఈ ఆకులు ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులను కేవలం వంటలకే కాకుండా మనకు కలిగే వ్యాధులను నయం చేసుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా తాగుతుండాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ఈ ఆకుల్లో అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. బిర్యానీ ఆకుల్లో యూజినాల్, లినాలూల్, మైరిసిన్, యూకలిప్టోల్, ఫ్లేవనాయిడ్స్, కెఫియిక్ యాసిడ్, విటమిన్లు ఎ, సి, బి2, బి3, బి6, బి9, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, సెలీనియం అధికంగా లభిస్తాయి. వీటి వల్ల ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు.
బిర్యానీ ఆకులతో తయారు చేసే నీళ్లను తాగడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఈ ఆకుల్లో ఉండే యూజినాల్, సినియోల్ అనే సమ్మేళనాలు జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సైతం తగ్గుతుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బిర్యానీ ఆకుల్లో అనేక పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను శరీరం మెరుగ్గా శోషించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు బిర్యానీ ఆకుల నీళ్లను తాగుతుంటే షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
ఈ ఆకుల్లో ఉండే యూజినాల్, మైరిసిన్ అనే సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. దీంతో శరీరంలో ఉండే వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మొకాళ్ల నొప్పులు, తలనొప్పి ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. బిర్యానీ ఆకుల్లో ఎక్స్పెక్టోరెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులతో చేసిన నీళ్లను సేవిస్తుంటే గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దీంతో దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముక్కు దిబ్బడ తొలగిపోతుంది. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్లు సి, ఎ, జింక్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, గుణాలు ఉంటాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలు తగ్గేలా చూస్తుంది.
బిర్యానీ ఆకుల్లో ఉండే లినలూల్ అనే సమ్మేళనం ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. బిర్యానీ ఆకుల నీళ్లను తాగితే కిడ్నీలకు మేలు జరుగుతుంది. ఈ ఆకుల్లో డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా ఉండే ద్రవాలను బయటకు పంపిస్తాయి. దీంతో కిడ్నీల్లోని టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలపై పడే భారం తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు కూడా బిర్యానీ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేయవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇలా బిర్యానీ ఆకులతో మనం అనేక లాభాలను పొందవచ్చు.