50 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి
పాండ్యా ఆల్‌రౌండ్ షో
సౌతాంప్టన్: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. పాండ్యా (33 బంతుల్లో 51; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకంతో మెరువగా.. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (17 బంతులోల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో అలీ, జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్ (28) పోరాడినా ఫలితం లేకపోయింది. చాహల్, అర్శ్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరుగనుంది.
ఒకరి తర్వాత ఒకరు..
కొవిడ్ నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) మంచి టచ్‌లో కనిపించడంతో టీమ్ఇండియాకు మెరుగైన ఆరంభం లభించింది. టాప్లే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రోహిత్.. మోయిన్ అలీ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అలీ వేసిన ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. అయితే అదే ఓవర్లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇషాన్ కిషన్ (8) క్యాచౌటయ్యాడు. ఓపెనర్లు వెనుదిరిగినా.. ఆరో ఓవర్లో హుడా హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 66/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. మంచి జోరు మీదున్న హుడాను జోర్డాన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్దిక పాండ్యా చక్కటి షాట్లతో అలరించాడు. పార్కిన్సన్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన హార్దిక్.. మిల్స్‌కు ఫోర్‌తో స్వాగతం పలికాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. లెగ్‌సైడ్ చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్న సూర్యకుమార్‌ను జోర్డాన్ బుట్టలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ (11) కంటే ముందొచ్చిన అక్షర్ పటేల్ (17) హార్దిక్‌కు చక్కటి సహకారమందించాడు.
మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం రోహిత్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. మరోవైపు పూర్తి స్థాయి సారథిగా బట్లర్‌కు కూడా ఇదే మొదటి మ్యాచ్.
అర్శ్‌దీప్ అరంగేట్రం
ఐపీఎల్లో అదరగొట్టి.. జాతీయ జట్టుకు ఎంపికైన యువ పేసర్ అర్శ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. ఆట ఆరంభానికి ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్శ్దీప్కు క్యాప్ అందించాడు. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌తో కలిసి అర్శ్‌దీప్ బరిలోకి దిగాడు.