ముల్తాన్: పాకిస్థాన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ ట్రాప్ అయ్యింది. దీంతో ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 152 రన్స్ తేడాతో పాకిస్థాన్ జయభేరీ(Pakistan Win) మోగించింది. 297 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగవ రోజు తొలి సెషన్లోనే 144 రన్స్‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 37 రన్స్ చేశాడు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో నొమన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లో 46 రన్స్ ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్టును ఇంగ్లండ్ గెలుచుకున్నది. మూడవ టెస్టు రావల్పిండిలో గురువారం ప్రారంభంకానున్నది.
Winning moments 📸
Pakistan beat England by 1️⃣5️⃣2️⃣ runs 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/AxAQX89cse
— Pakistan Cricket (@TheRealPCB) October 18, 2024
రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నొమన్ అలీ, సాజిద్ ఖాన్లు ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముల్తాన్ పిచ్‌పై స్పిన్ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో ఆ ఇద్దరు స్పిన్నర్లే 20 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ ఏడు వికెట్లు, రెండు ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక నొమన్ అలీ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ తరపున 1972 తర్వాత ఇద్దరు స్పిన్నర్లు మొత్తం 20 వికెట్లు తీసుకోవడం ఇదే మొదటిసారి.
ఈ గెలుపుతో పాకిస్థాన్ .. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 8వ స్థానం చేరుకున్నది. అయితే మ్యాచ్ ఓడినా.. ఇంగ్లండ్ మాత్రం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలోనే ఉన్నది. 98 పాయింట్లతో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది.