మెల్బోర్న్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠగా జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ కమిన్స్ బంతి (2/39)తో పాటు బ్యాట్ (32 నాటౌట్)తోనూ రాణించి కంగారూల విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను స్టార్క్ (3/33), కమిన్స్, జంపా (2/64) కట్టడి చేయడంతో ఆ జట్టు 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (44) ఫర్వాలేదనిపించాడు. అనంతరం ఛేదనలో స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) రాణించడంతో ఆసీస్ ఒక దశలో 138/3తో పటిష్టంగానే ఉంది. కానీ హరీస్ రౌఫ్ (3/67) మిడిలార్డర్‌ను దెబ్బకొట్టడంతో కష్టాల్లో పడింది. అయితే కమిన్స్ పాక్ బౌలర్లకు ఎదురునిలిచి ఆసీస్‌ను గెలిపించాడు.