Shoaib Akhtar : ప్రపంచ క్రికెట్లోని ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరు? అనే ప్రశ్నకు చాలామంది నోటి నుంచి వచ్చే సమాధానం.. షోయబ్ అక్తర్ (Shoaib Akhtar). ‘రావల్సిండి ఎక్స్‌ప్రెస్’గా పేరొందిన ఈ పాకిస్థానీ పేసర్ ఒకప్పుడు బ్యాటర్లను వణికించాడు. అక్తర్ సంధించే బుల్లెట్‌లాంటి బంతులను కాచుకోలేక ఇబ్బందిపడిన క్రికెటర్లు చాలామందే. గంటకు సగటున 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే అక్తర్ ఆటకు వీడ్కోలు పలికి 13 ఏండ్లు అవుతుంది.
అయితే.. ఇప్పుడు మళ్లీ ఈ పాక్ లెజెండరీ పేసర్ పేరు వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా.. అచ్చం అతడిని పోలిన ఓ కుర్రాడు ఇంటర్నెట్లో జూనియర్ అక్తర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకూ జూనియర్ అక్తర్ ఎక్కడ కంటపడ్డాడంటే.. ఒమన్ దేశంలో జరుగుతున్న డీ10 లీగ్ మ్యాచ్‌లో. అక్తర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఆ యువ పేసర్ పేరు ఇమ్రాన్ ముహమ్మద్(Imran Muhammad).
He’s more Shoaib Akhtar than Shoaib Akhtar himself… pic.twitter.com/cXKQGgNgbn
— Prashanth S (@ps_it_is) September 19, 2024
బంతిని సంధించేందుకు అతడు పరుగెత్తుతూ వస్తున్న తీరు అక్తర్‌ను తలపిస్తుంది. అవును.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ లెక్కనే ఇమ్రాన్ ఉరికొస్తుంటే అతడి జులపాల జట్టు ఎగిరిపడుతోంది. ఇంకేముంది.. అక్తర్ వారసుడు దొరికాడంటూ ఇమ్రాన్ బౌలింగ్‌ను నెటిజన్లు పొగిడేస్తున్నారు.
పేసర్లకు నెలవైన పాకిస్థాన్ నుంచి వచ్చిన అక్తర్ అనతికాలంలోనే తన ముద్ర వేశాడు. అమితమైన వేగంతో బౌలింగ్ చేస్తూ వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. అక్తర్ 2003లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ బాల్ విసిరి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన వన్డేలో ఈ స్పీడ్‌స్టర్ ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.
అంతే..అప్పటివరకూ ఉన్న వేగవంతమైన బంతి విసిరిన వాళ్ల రికార్డులు బద్ధలైపోయాయి. అక్తర్ తన కెరీర్లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 444 వికెట్లు పడగొట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన అక్తర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రికెట్ విశ్లేషణలతో అభిమానులను అలరిస్తున్నాడు.