లక్నో: పిల్లలతో కలిసి ఆడుకుంటున్న కుమార్తె చర్య పట్ల తండ్రి ఆగ్రహించాడు. కాల్చిన కాడతో ఆమెకు వాతలు పెట్టాడు. (Man Arrested For Branding Daughter) అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక తాతను కూడా అతడు కొట్టాడు. దీంతో బాలిక తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోన్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం తోటి పిల్లలతో కలిసి ఇంట్లో ఆడుకున్నది. ఈ సందర్భంగా కూరగాయలు ఉన్న సంచిని కొన్ని మేకలు పడేశాయి.
కాగా, ఇది చూసి బాలిక తండ్రి రామ్‌స్వరూప్ అలియాస్ రామ్సు ఆగ్రహించాడు. ఇంట్లోని స్టవ్‌పై కాడ కాల్చి కుమార్తె చేతులు, శరీరంపై వాతలు పెట్టాడు. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన తన తండ్రిని కూడా దారుణంగా కొట్టాడు. దీంతో బాలిక తాత లలంజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలికను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి రామ్స్వరూప్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.