కరాచీ : బంగ్లాదేశ్‌ను టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా టోర్నీ నుంచి బాయ్‌కాట్ చేస్తామని బెదిరింపులకు దిగిన పాకిస్థాన్.. అంత సాహసం చేయనప్పటికీ ఐసీసీకి మాత్రం ఝలక్ ఇచ్చింది. గ్రూప్ దశలో భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ ఈనెల 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు మాత్రం మా జట్టు బరిలోకి దిగదు’ అని పేర్కొంది.
టోర్నీలో అత్యంత ఆకర్షణ ఉన్న మ్యాచ్‌ల్లో ఒకటైన దాయాదుల పోరు జరుగకపోవడం ఆర్థికపరంగా బ్రాడ్కాస్టర్లతో పాటు ఐసీసీకి భారీ ఎదురుదెబ్బే! అయితే గ్రూప్ దశలో టీమ్ఇండియాతో మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్.. నాకౌట్ దశలో ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేస్తుందన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. పాక్ గనుక ఇదే నిర్ణయంపై కట్టుబడి ఉంటే భారత్.. కొలంబో వెళ్లాల్సిన అవసరం ఉండకపోగా అదనంగా మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు కూడా జమ అవుతాయి.