న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో పాకిస్తాన్ జట్టు నెంబర్ వన్ ర్యాంక్ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. కేవలం పద్నాలుగా రోజులకే పాకిస్తాన్ నెంబర్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ జట్టు 123 భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో 121 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
పాకిస్థాన్ జట్టు 120 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. కాగా పాకిస్థాన్ జట్టు ఆగస్టు 26న అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. కానీ రెండు వారాలు కూడా తిరక్కుండానే తిరిగి రెండో స్థానానికి వచ్చింది. ఇదిలావుంటే 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నది.