న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ జరగనున్నది. ఆ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ హాకీ(Pakistan Hockey Team) జట్టు రానున్నది. అయితే ఇటీవల ఇండియా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ హాకీ జట్టుకు అనుమతి ఇస్తారా లేదా అన్న అంశం చర్చకు దారి తీసింది. ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్ హాకీ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. భారత్‌లో నిర్వహించే బహుళ జాతి పోటీల్లో పాల్గొనే జట్లను తాము ఏమీ అడ్డుకోవడం లేదని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.. కానీ ద్వైపాక్షిక టోర్నీ అంశంలో నిర్ణయం మరోలా ఉంటుందన్నారు.అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలను బట్టి తాము వెనక్కి తగ్గడంలేదన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధంలో ఉన్నా.. కచ్చితంగా ఆ రెండు జట్లు బహుళ ప్రయోజనాల ఈవెంట్లలో పాల్గొంటాయన్నారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆసియాకప్ హాకీ టోర్నీ జరగనున్నది. సెప్టెంబర్‌లో జరిగే ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో పాకిస్థాన్ ఆడుతుందా లేదా అన్న ప్రశ్నకు బదులిస్తూ బీసీసీఐ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. బీసీసీఐ మమ్ములను సంప్రదించినప్పుడు దానిపై అప్డేట్ ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ చెప్పింది.