ఢిల్లీ: దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఆ దేశంతో క్రమంగా సంబంధాలు తెంపుకుంటున్న భారత్.. క్రీడల్లోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినగా.. ఈ ఏడాది ఆగస్టు నుంచి బీహార్ (రాజ్‌గిర్) వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ హాకీలో పాక్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
ఆగస్టు 27-సెప్టెంబర్ 07 మధ్య 12వ ఎడిషన్‌గా జరిగే ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌తో పాటు జపాన్, కొరియా, చైనా, మలేషియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్థాన్ పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులతో పాక్ ఆసియా కప్ ఆడటం కష్టమేనన్న వాదన వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగే హాకీ ప్రపంచకప్‌నకు ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో పాక్‌ను ఆసియా కప్ ఆడేందుకు అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై అనిశ్చితి నెలకొంది. దీనిపై హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీకి ఇంకా మూడు నెలల సమయముంది. ఇప్పుడే దీని గురించి మాట్లాడటం సమంజసం కాదు. కానీ మేం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం’ అని చెప్పారు. ఒకవేళ పాక్‌ను ఆడించకుంటే ఆ స్థానంలో మరో దేశాన్ని చేర్చే అవకాశముంది.