లాహోర్: ఐపీఎల్‌కు తామేమీ తక్కువకాదని గొప్పలకు పోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆరంభానికి ముందే తత్వం బోధపడినట్టుంది. గతంలో ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే ఈ లీగ్‌ను ఇప్పుడు ఐపీఎల్‌తో సమాంతరంగా ఈ మాసాంతం నుంచి ప్రారంభించాలని ప్రణాళికలు రచించిన పీసీబీకి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఈనెల 26 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్‌ను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకార 6 నగరాల్లో కాకుండా లాహోర్, కరాచీకే పరిమితం చేస్తున్నట్టు బోర్డు వెల్లడించింది.
అంతేగాక ప్రేక్షకులు లేకుండానే ఈ లీగ్‌ను నిర్వహించనున్నట్టు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ తెలిపాడు. ‘పీసీఎల్‌కు అంతర్జాతీయ బ్రాండ్ ఉంది. లీగ్‌ను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 నుంచే మొదలుపెడ్తాం. అయితే తాజా పరిణామాల (ఇరాన్ యుద్ధం) నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు రెండు వేదికల్లోనే ప్రేక్షకుల్లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించనున్నాం. టికెట్ల ఆదాయాన్ని కోల్పోతున్న ఫ్రాంచైజీల ఇబ్బందులు మేం అర్థం చేసుకోగలం. వారి నష్టాన్ని భర్తీ చేస్తాం’ అని చెప్పాడు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాక్‌ను చమురు కష్టాలు వెంటాడుతుండగా, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉన్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం పీసీబీని కుదించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు వార్తలొస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని పీఎస్ఎల్ను తాత్కాలికంగా వాయిదావేసినా ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో బిజీ షెడ్యూల్ కారణంగా మళ్లీ ఈ లీగ్‌ను నిర్వహించడం కష్టమవనున్న నేపథ్యంలో బండిని ఎలాగోలా లాగించడమే బెటర్ అన్న యోచనలో పీసీబీ ఉంది. తాజా ఎడిషన్‌లో రెండు ఫ్రాంచైజీలను పెంచి ఈసారి లీగ్‌ను సూపర్ హిట్ చేద్దామనుకున్న ఆ బోర్డుకు ఇది ఎదురుదెబ్బే! ఇప్పటికే విదేశీ ప్లేయర్లు పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్‌కు మళ్లుతున్న వేళ ఇది షాక్. ప్రభుత్వ ఆదేశాలతో పీఎస్ఎల్ ఆరంభ వేడుకలనూ పీసీబీ రద్దు చేసుకుంది.
పీఎస్ఎల్కు మరో ఇంటర్నేషనల్ క్రికెటర్ గుడ్‌బై చెప్పనున్నాడు. శ్రీలంక మాజీ సారథి, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో లంకను నడిపించిన దసున్ శనక సైతం పీఎస్ఎల్ను వీడనున్నాడు. త్వరలోనే అతడు రాజస్థాన్ రాయల్స్‌తో కలువనున్నట్టు సమాచారం. పీఎస్ఎల్లో లాహోర్ ఖలాండర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉన్న శనకను.. గాయపడ్డ సామ్ కరన్ స్థానంలో భర్తీ చేసుకునేందుకు రాయల్స్ సిద్ధమైంది. త్వరలోనే శనక పీఎస్ఎల్కు గుడ్‌బై చెప్పి రాయల్స్‌తో కలుస్తాడని ఆ జట్టు వర్గాలు తెలిపాయి. ఇదివరకే జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని.. పీఎస్ఎల్ను వీడి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడనున్న విషయం విదితమే.