సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది. అయితే పాక్ జట్టు కోచ్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ సమయంలో.. ఆ టోర్నీ గురించి ఆస్ట్రేలియా బోర్డు పెద్దగా ప్రచారం చేపట్టలేదని గిలెస్పీ అన్నారు. ఆసీస్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై పాక్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నది.
పాక్ జట్టు ప్రదర్శన పట్ల గెలెస్పీ సంతోషంతో ఉన్నా.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఆ టోర్నీకి సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఆస్ట్రేలియా బోర్డు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే తమ సిరీస్‌కు ఎటువంటి ప్రమోషన్ జరగలేదని గిలెస్పీ ఆరోపించారు. క్రికెట్ ప్రమోషన్లో ఫాక్స్ అద్భుతమైన పాత్ర పోషిస్తుందని, కానీ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రాధాన్యత మారిందని, అయినా అది వాళ్ల నిర్ణయమని, కానీ ఈ సిరీస్‌కు అడ్వర్టయిజింగ్, ప్రమోషన్ చూడలేదన్నారు.
ఇండియా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ లబుషేన్ లాంటి ఆటగాళ్లను పెర్త్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చారని గిలెస్పీ తెలిపారు.