కాబూల్: సరిహద్దు దేశాలతో నిత్యం ఘర్షణలకు దిగుతూ అంతర్జాతీయ సమాజం ఎదుట అభాసుపాలవుతున్న పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అఫ్ఘానిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్‌పై వైమానిక దాడులకు తెగబడి 8 మంది ప్రాణాలు తీసిన కయ్యాలమారికి కాబూలీలు దీటైన బదులిచ్చారు. త్వరలో పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్న ముక్కోణపు టీ20 సిరీస్ (పాక్, అఫ్గాన్, శ్రీలంక) నుంచి వైదొలుగుతున్నట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) శనివారం తెలిపింది. పాక్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మరణించినవారిలో తమ దేశానికి చెందిన ముగ్గురు దేశవాళీ క్రికెటర్లూ ఉన్నారని.. వారి అమరత్వానికి గౌరవసూచకంగా సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
శుక్రవారం పాకిస్థాన్.. పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాపై వైమానిక దాడులకు దిగింది. అయితే ఈ దాడిలో స్థానిక క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్ మృతి చెందారు. ఓ స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు గాను షరాన్ వెళ్లివస్తుండగా పాక్ జరిపిన దాడిలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏసీబీ స్పందిస్తూ.. ‘ఉర్గున్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనపై ఏసీబీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది. పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన ఈ పిరికిపంద చర్యతో మేము ముగ్గురు క్రికెటర్లను కోల్పోయాం. బాధితులకు గౌరవ సూచకంగా నవంబర్ చివర్లో పాక్‌లో జరగాల్సి ఉన్న ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపింది.
ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెటర్లూ స్పందిస్తూ పాక్ తీరును ఎండగట్టారు. అమాయక పౌరుల ప్రాణాలు తీయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆ జట్టు సారథి రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘పాక్ జరిపిన దాడిలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం క్రూరమైన చర్య. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనను సూచిస్తున్నది. ఈ సందర్భంగా ఏసీబీ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. పాక్ ఆర్మీ చర్యను అఫ్గాన్ స్వాతంత్య్రంపై దాడిగా అభివర్ణించిన ఆ జట్టు మాజీ సారథి గుల్బాదిన్ నయీబ్.. ఇవి తమ దేశ ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయలేవని తెలిపాడు. మిగిలిన క్రికెటర్లు సైతం మృతులకు సంతాపాన్ని ప్రకటించారు.