దుబాయ్: ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బుధవారం నాటకీయ పరిణామాల మధ్య నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో యూఏఈపై చెమటోడ్చి నెగ్గింది. దీంతో నాలుగు పాయింట్లతో పాక్ సూపర్-4కు అర్హత సాధించగా, యూఏఈ నిష్క్రమించింది. తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. 9 పరుగులకే ఓపెనర్లు ఫర్హాన్(5), ఆయూబ్(0) వికెట్లు కోల్పోయిన జట్టును ఫకర్ జమాన్(36 బంతుల్లో 50, 2ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు ఆఖర్లో షాహిన్ షా ఆఫ్రిదీ(14 బంతుల్లో 29 నాటౌట్, 3ఫోర్లు, 2సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో గౌరవప్రదమైన స్కోరు అందుకుంది.
ముఖ్యంగా జమాన్.. యూఏఈ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగిన జమాన్..మూడో వికెట్‌కు కెప్టెన్ సల్మాన్ ఆగా(20)తో 63 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో ఆఫ్రిదీ బ్యాటు ఝులిపించడంతో పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సిద్ధిఖి(4/18), సిమ్రన్జీత్సింగ్(3/26) రాణించారు. లక్ష్యఛేదనలో యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా(35), ధృవ్ ప్రశార్(20) ఆకట్టుకున్నారు.