PAK vs BAN | ఆసియాకప్-2023లో పాకిస్థాన్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లతో పాటు బ్యాటర్లు కూడా చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే పాక్ పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీం షా, హారస్ రౌఫ్ చుక్కలు చూపించారు. 10 ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు కూడా చేయకుండానే బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ కుప్పకూలిన సమయంలో మిడిలార్డర్ ప్లేయర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హాసన్ (53), రహీమ్ (64) పాక్ పేసర్లకు ధీటుగా బదులిచ్చారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. ఇద్దరి భాగస్వామ్యంలో జట్టుకు కీలక స్కోర్ అందించారు. కానీ షకీబ్ హాసన్, రహీమ్ ఔటైన తర్వాత బంగ్లాదేశ్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఆ సమయంలో మరింత చెలరేగిన పాక్ పేసర్లు వరుసగా వికెట్లను తీశారు. దీంతో 38.4 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ అన్ని వికెట్లను కోల్పోయింది. హరీస్ రవుఫ్, నసీం షా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్‌ను పాక్ పేసర్లు తమ బౌలింగ్‌తో కట్టడి చేయగా.. చేజింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లు కూడా అదే దూకుడు చూపించారు. ఫఖర్ జామాన్ (20), బాబర్ ఆజాం (17 ) విఫలమైనప్పటికీ.. మామ్ ఉల్ హాక్ (78 ), మహమ్మద్ రిజ్వాన్ (63*) చెలరేగి ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో మెరిశారు. రిజ్వాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అఘా సల్మాన్ (12 ) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించారు.