Handshake Snub |ఆసియా కప్‌లో భారత్, పాట్ ఆటగాళ్ల కరచాలనం వావాదం (Handshake Snub) మరింత ముదురుతున్నది. ఆదివారంనాటి దాయాదుల పోరుకు రిఫరీగా (Match referee) వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను (Andy Pycroft) తదుపరి మ్యాచ్‌లకు తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) డిమాండ్ చేస్తున్నది. లేనట్లయితే తాము ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగుతున్నది.
ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోని విషయం తెలిసిందే. టాస్ సందర్భంగా గానీ.. మైదానంలో ఆడేప్పుడు గానీ దాయాదులతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించిన టీమ్ఇండియా.. ఆట ముగిశాక కూడా పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండానే డగౌట్‌కు చేరింది. పాక్ ప్లేయర్లు మైదానంలో వేచి చూసినా భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి అలాంటి స్పందనేమీ రాలేదు. దీంతో అవమానానికి గురైన పాకిస్థాన్.. ఐసీసీ తలుపు తట్టింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. భారత ఆటగాళ్ల చర్యకు మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని డిమాండ్ చేసింది. మిగిలిన మ్యాచ్‌లకు అతడిని తప్పించకపోతే టోర్నీ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికే పీసీబీ చీఫ్, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఐసీసీకి ఇప్పటికే లేఖ రాశారు.
పీసీబీ.. ఐసీసీలో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక కారణముంది. టాస్ వేసేప్పుడు భారత కెప్టెన్ సూర్యతో కరచాలనం చేయవద్దని పాక్ సారథి సల్మాన్ అఘాతో చెప్పాడని పీసీబీ చెబుతున్నది. సాధారణంగా మ్యాచ్‌లో టాస్ వేసేప్పుడు ఇరుజట్ల సారథులు కరచాలనం చేసుకోవడంతో పాటు టీమ్ షీట్ (ఎవరెవరు ఆడుతున్నారు? అని ఉండే పేపర్)ను ఒకరినొకరు మార్చుకుంటారు. కానీ మొన్నటి మ్యాచ్‌లో మాత్రం పైక్రాఫ్ట్ ఆ పనిచేశాడని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవీద్ చీమ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు ఫిర్యాదుచేశాడు. మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లు కరచాలనం ఇవ్వకుండా వెళ్లడానికీ కారణం ఆయనేననేది పాక్ వాదన. ఈ మేరకు పీసీబీ స్పందిస్తూ.. ‘పైక్రాఫ్ట్ చేసిన పనిపై నవీద్ ఏసీసీకి ఫిర్యాదుచేశాడు. భారత ఆటగాళ్ల తీరుపైనా అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అందుకే పోస్ట్ మ్యాచ్ సెర్మనీకి మేం మా కెప్టెన్‌ను పంపించలేదు’ అని తెలిపింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ క్రికెట్ నిబంధనలను అనుసరించి పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది.
జింబాబ్వేకు చెందిన మాజీ ఆటగాడు పైక్రాఫ్ట్ ఆదివారం నాటి మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించారు. ఏషియా కప్‌కు ఐసీసీ కేటాయించిన ఇద్దరు రిఫరీల్లో ఆయన ఒకరు. బుధవారం పాక్-యూఏఈ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాల్సి ఉన్నది. అయితే పాక్ బెదిరిస్తున్నట్లుగా యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టంగా మారనుంది. ఎందుకంటే గ్రూప్-ఏలో ఉన్న పాక్.. ఇప్పటికే ఒక విజయం, ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బుధవారం నాటి మ్యాచ్‌కు దూరంగా ఉంటే యూఏఈకి పాయింట్లు దక్కుతాయి. దీంతో భారత్‌తోపాటు ఆతిథ్య జట్టు సూపర్ 4కి చేరుకుంటుంది. దీంతో గ్రూప్‌లో అగ్రభాగాన ఉన్న రెండు జట్లు మాత్రమే తదుపరి రౌండ్‌కు వెళ్లనున్నాయి.
కాగా, ఇలాంటి బెదిరింపులను పట్టించుకోకూడదని ఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే అంతర్జాతీయ స్థాయిలోనూ ఇలా జరుగడం ఇదేమీ కొత్త కాదు. 2023 వింబుల్డన్ సందర్భంగా ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా.. బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకాతో మ్యాచ్ ముగిశాక ఆమెకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాను రష్యా, బెలారస్ ప్లేయర్లతో కరచాలనం చేయబోనని స్పష్టం చేసింది. క్రీడాస్ఫూర్తిని పాటించలేదని అప్పుడు వింబుల్డన్ ఆమెపై ఎటువంటి చర్యలకూ దిగలేదు.