 
                                                            Aquib Javed : ఆసియా కప్(Asia cup 2023)లో అసలు సిసలైన సమరం రేపు జరుగనుంది. దాయాదులు భారత్(India), పాకిస్థాన్(Pakistan) కొలంబోలో సూపర్ 4 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రద్దు కావడంతో ఈసారి పైచేయి సాధించేది ఎవరు? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో భారత టాపార్డ్కు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi) సవాల్ విసరనున్నాడు. అయితే.. కొత్త బంతితో చెలరేగిపోయే ఇతడిని ఎదుర్కోవడం గురించి పాక్ మాజీ పేసర్ అకిబ్ జావేద్(Aquib Javed) భారత క్రికెటర్లకు ఓ సలహా చెప్పాడు.
ఆఫ్రీదీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(virat kohli) లెక్క దూకుడుగా ఆడాలని, వెస్టిండీస్ దిగ్గజం చందర్‌పాల్(Chanderpaul) మాదిరిగా వికెట్లను కాచుకోవద్దని అన్నాడు. ‘షాహీన్ ఆఫ్రీదీని సమర్ధంగా ఎదుర్కోవాలంటే అతడు విసిరే బుల్లెట్ లాంటి బంతుల్ని ఆడాలి. బౌలర్ ఎవరు? అనేది ఆలోచించొద్దు. వికెట్ కాపాడుకోవడం కంటే పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాలి. బౌండరీలు బాదాలి. చెప్పాలంటే విరాట్ కోహ్లీలా ఆడాలి. అంతేతప్ప ఒక్కసారిగా చందర్ పాల్ మారిపోవద్దు’ అని జావేద్ తెలిపాడు.

ఆసియా కప్‌లో భారత్, పాక్ సెప్టెబర్ 2న తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆఫ్రీదీ 4 వికెట్లతో హడలెత్తించాడు. తొలుత వరుస ఓవర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. తన రెండో స్పెల్‌లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాను పెవిలియన్ పంపాడు. దాంతో, ఇండియా 266 పరుగులకే ఆలౌటయ్యింది. అందుకని సూపర్ 4లో భారత ఆటగాళ్లు షాహీన్ ఆఫ్రీదీని దీటుగా ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టారు.
 
                            