Raza Hassan : పాకిస్థాన్‌కు చెందిన మరో క్రికెటర్ భారత అల్లుడు కాబోతున్నాడు. క్రికెటర్ రజా హసన్ (Raza Hassan) భారత అమ్మాయిని పెండ్లి చేసుకోబోతున్నాడు. న్యూయార్క్‌లో పూజ్య బొమ్మన్నన్ (Poojya Bommannan) అనే భారతీయురాలితో అతడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే తాము వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నామని రజా వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అతడు తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఎంగేజ్మెంట్ అయింది. నా హృదయపు రాణిని జీవితకాలం నాతో ఉండాల్సిందిగా కోరాను. అందుకు ఆమె ఓకే చెప్పేసింది. ఇక ఇద్దరం మా కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం’ అని రజా తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
పాక్ క్రికెటర్లు భారతదేశపు అమ్మాయిలను పెండ్లి చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. హసన్ అలీ, మొహ్సిన్ ఖాన్, జహీర్ అబ్బాస్‌లు భారత అమ్మాయలతో ప్రేమలో పడి మనువాడారు. త్వరలోనే రజా కూడా ఈ జాబితాలో చేరనున్నాడు. పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున రజా 10 టీ20లు, ఒకే ఒక వన్డే మాత్రమే ఆడాడు.