Pahalgam Attack | పహల్గాంలో జరిగిన ఇద్దరు విదేశీయులు సహా 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, దాడిపై పాక్ దౌత్యవేత్తలు, క్రికెటర్లు సైతం స్పందించలేదు. కానీ, పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం సొంత దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను ప్రశ్నించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు సంబంధం లేకపోతే.. షాబాజ్ ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాక్ పాత్ర లేకపోతే షెహబాజ్ షరీఫ్ ఇంకా దానిపై ఎందుకు స్పందించలేదు? అకస్మాత్తుగా సైన్యాన్ని ఎందుకు అప్రమత్తంగా ఉంచారు? ఎందుకంటే నిజం ఏమిటో మీకు తెలుసు. మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మద్దతు ఇస్తున్నారు. మీరు సిగ్గుపడాలి’ డానిష్ కనేరియా ఘాటుగా స్పందించాడు.
కనేరియా ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందించాడు. ‘పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని భారతదేశం స్పాన్సర్ చేస్తోంది. బహుశా భారత రా బృందం కర్మ నుంచి పాఠం నేర్చుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి కరేనియా బదులిస్తూ ‘బలూచ్ ప్రజల బాధలకు కారణమైన వారి పక్షాన నిలబడటానికి మీరు సిగ్గుపడాలి. భారతదేశంపై తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేయడానికి మీరు సిగ్గుపడాలి. మీరు సమాజ విలువలకు ప్రాతినిధ్యం వహించరు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సమర్థించడం అవమానకరమైనది’ అంటూ బదులిచారు. మరో ట్వీట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని మండిపడ్డాడు. ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.
మరో ట్వీట్లో తాను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొందరు భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని నిలదీశాడు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, సెనేటర్ బిల్ హాగెర్టీ ట్వీట్లను రీట్వీట్ చేశారు. అయితే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాజీ లెగ్ స్పిన్నర్ పోస్టులు పెట్టడంపై ఓ నెటిజన్ ప్రశ్నలు సంధించాడు. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కాలేదు. పాక్ తరఫున ఆడుతారు. పాక్ క్రికెట్ ద్వారా పేరు సంపాదించాడు. ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేయగా.. దీనికి కరేనియా సైతం గట్టిగానే బదులిచ్చాడు. తాను పాకిస్తాన్ లేదంటే.. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
పాక్ ప్రజలు సైతం ఉగ్రవాదంతో నష్టపోతున్నారని, శాంతి కోసం నిలబడే వారే నాయకత్వానికి అర్హులని.. అయామక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు మౌనంగా ఉండే వారు కాదు. ఒకప్పుడు గర్వంగా పాక్ జెర్సీ ధరించాను. క్రికెట్ మైదానంలో నా చెమటను, రక్తాన్ని చిందించాను. కానీ, చివరికి నన్ను పహల్గామ్ దాడి బాధితుల నుంచి భిన్నంగా చూడలేదు. హిందువుగా ఉన్నందుకు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారు, హంతకులను రక్షించే వారు సిగ్గు సిగ్గు. నేను సత్యానికి అండగా నిలుస్తాను. నేను మానవత్వానికి అండగా నిలుస్తాను’ అంటూ కనేరియా స్పందించాడు.
డానిష్ కనేరియా తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్ అనిల్ దల్పత్ సైతం పాక్ తరఫున బరిలోకి దిగాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్ తరఫున 61 టెస్ట్‌లు ఆడి 261 వికెట్లు తీశాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. కనేరియా హిందువు అన్న కారణం చేత పాక్ క్రికెట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జట్టులో కనేరియా ఉండడం చాలా మంది క్రికెటర్లకు నచ్చేది కాదు. ఈ విషయాన్ని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్వయంగా తెలిపాడు. కనేరియా స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవిత కాలం నిషేధం విధించారు. ప్రస్తుతం పాక్, ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ఆ దేశాన్ని విడిచిపెట్టి యూకేలో ఉంటున్నాడు.