శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 17, 2021 , 14:11:23

హ్యాట్సాఫ్.. శార్దూల్‌, సుంద‌ర్‌ల‌పై కోహ్లి ప్ర‌శంస‌లు

హ్యాట్సాఫ్.. శార్దూల్‌, సుంద‌ర్‌ల‌పై కోహ్లి ప్ర‌శంస‌లు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత‌మైన పోరాటం చేసిన టీమిండియా యువ ఆట‌గాళ్లు శార్దూల్ ఠాకూర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌పై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ ఇద్ద‌రూ అసాధార‌ణంగా పోరాడార‌ని, టెస్ట్ క్రికెట్ అంటే ఇదీ అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. తొలి టెస్ట్‌లోనే సుంద‌ర్ చూపిన స‌హ‌నం అద్భుత‌మంటూ.. శార్దూల్ కోసం మ‌రాఠీలో కొన్ని ప‌దాలు రాశాడు. తూలా ప‌రాట్ మాన్లారే ఠాకూర్ అని కోహ్లి ట్వీట్ చేశాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో 67 ప‌రుగులు చేసిన ఠాకూర్‌.. సుంద‌ర్‌తో క‌లిసి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని భారీగా త‌గ్గించేసిన విష‌యం తెలిసిందే. 

తూలా ప‌రాట్ మాన్లా అంటే..

కోహ్లి చేసిన ఈ ట్వీట్‌కు అర్థ‌మేంటో మహారాష్ట్ర‌కే చెందిన మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ వివ‌రించాడు. దీని అర్థం నీకు మ‌ళ్లీ హ్యాట్సాఫ్ అని మంజ్రేకర్ చెప్పాడు. నీకు హ్యాట్సాఫ్ అని చెప్ప‌డానికి తాము మ‌రాఠీలో త‌ర‌చూ తూలా మాన్లా అని వాడ‌తామ‌ని, ఇక్క‌డ తూలా ప‌రాట్ మాన్లా అంటే నీకు మ‌ళ్లీ హ్యాట్సాఫ్ అని అర్థ‌మ‌ని తెలిపాడు. మ‌ళ్లీ ఎందుకు చెప్పాడ‌న్న‌దాని గురించి కూడా మంజ్రేక‌ర్ వివ‌రించాడు. 2019లో వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో కీల‌క‌మైన 17 ప‌రుగులు చేసి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు శార్దూల్ ఠాకూర్‌. ఆ స‌మ‌యంలో కోహ్లి త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి ఠాకూర్ ఇన్నింగ్స్‌ను పొగ‌డ‌టానికి మ‌రాఠీలో ఏమ‌నాలో చెప్ప‌మంటూ అడిగాడ‌ని మంజ్రేక‌ర్ చెప్పాడు. అప్పుడే తాను ఈ ప‌దాలు చెప్పిన‌ట్లు వివ‌రించాడు. 

VIDEOS

logo