లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం! స్వియాటెక్, రిబకినా వంటి అగ్రశ్రేణి ప్లేయర్ల నిష్క్రమణ అనంతరం ఈ టోర్నీలో టాప్‌సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)కూ షాక్ తప్పలేదు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా.. 2-6, 6-7 (2/7)తో జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకా చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటిబాట పట్టింది. ఈ విజయంతో ఒసాకా తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో 2024 చాంపియన్ బార్బొర క్రెజికోవా (చెక్)కు 5-7, 7-5, 3-6తో అదే దేశానికి చెందిన కరోలినా ముచోవా చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కరోలినాదే పైచేయి అయింది. యూఎస్ఏ అమ్మాయి జెస్సికా పెగులా.. 4-6, 6-3, 6-1తో ఇవా జోవిచ్ (అమెరికా)ను ఓడించింది. క్రెజికోవా ఓడటంతో ఈ ఏడాది కూడా వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత రానుండటం గమనార్హం. టోర్నీలో ఇప్పటికే గత చాంపియన్లు స్వియాటెక్, రిబకినా, సెరెనా ఓడిపోగా టైటిల్ గెలిచినవారిలో ఉన్న క్రెజికోవా సైతం ప్రిక్వార్టర్స్‌లో ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో మరో కొత్త విజేతను చూడనుండటం వరుసగా ఇది తొమ్మిదోసారి. 2016లో సెరెనా రెండోసారి సింగిల్స్ టైటిల్ గెలిచాక మరే మహిళా క్రీడాకారిణి కూడా ఆ ఘనతను అందుకోలేకపోయింది.
జొకో క్వార్టర్స్‌కు..
ఇక కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా వింబుల్డన్ బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీలో మరో అడుగు ముందుకేశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ జొకో.. 7-6 (8/6), 6-3, 3-6, 6-3తో రొమాన్ సాఫీఉల్లిన్ (రష్యా)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.