ఫామ్‌లో లేని అజింక్యా రహానే స్థానంలో.. సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం! టీ20 సారథ్యానికి టాటా చెప్పిన విరాట్ కోహ్లీని.. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం! దీనిపై విరాట్ బాహాటంగానే బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడటం! గత కొన్ని రోజులుగా ఇలా ఆటేతర విషయాలతో వార్తల్లోకెక్కిన భారత క్రికెట్ జట్టు.. మళ్లీ మైదానంలో అడుగు పెట్టనుంది! సఫారీ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్టు సిరీస్ పట్టేందుకు టీమ్ఇండియా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నది.
మరోవైపు సీనియర్ ఆటగాళ్ల వీడ్కోలు తరువాత డీలా పడ్డ సఫారీ జట్టు సొంతగడ్డపై కోహ్లీసేనను ఓడించి పూర్వవైభవం సంతరించుకోవడంతో పాటు తమ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేటి నుంచి బాక్సింగ్ డే పోరు ప్రారంభం కానుంది! మరింకెందుకు ఆలస్యం.. అసలు సిసలు టెస్టు మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
సెంచూరియన్: ఇటీవలి కాలంలో విదేశాల్లో చక్కటి ప్రదర్శన కొనసాగిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ పట్టేందుకు రెడీ అవుతున్నది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న కోహ్లీసేన.. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. గాయం కారణంగా రోహిత్ దూరమవడంతో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌తో బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్యానికి దూరమైన కోహ్లీ ఇక బ్యాటర్‌గా తన పూర్వ ఫామ్‌ను అందిపుచ్చుకుంటే సఫారీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమే. టాపార్డర్‌లో మిగిలిన ఏకైక స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతుండటం మేనేజ్మెంట్ను ఇరకాటంలో పడేసింది. ఇటీవల న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న తాజా మాజీ వైస్‌కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు ఆటగాడు హనుమ విహారి ఐదో స్థానం కోసం పోటీ పడుతున్నారు. సఫారీ గడ్డపై మంచి రికార్డు ఉన్న రహానే వైపు మొగ్గుచూపుతారా.. లేక యువ ఆటగాడు శ్రేయస్‌పై నమ్మకముంచుతారా చూడాలి. ఐదుగురు బౌలర్ల కూర్పుతోనే బరిలోకి దిగే చాన్స్‌లు ఉన్నాయని ఇప్పటికే రాహుల్ సూచనాప్రాయంగా పేర్కొనడంతో.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీతో పాటు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమే. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ బరిలోకి దిగనున్నాడు. ఇక మరోవైపు సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణ, బోర్డు ఆర్థిక నష్టాలతో డీలా పడ్డ దక్షిణాఫ్రికా జట్టు.. ప్రపంచ అత్యుత్తమ జట్టుపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది. అనుభవం రిత్యా భారత్‌దే పైచేయిలా కనిపిస్తున్నా.. సొంతగడ్డపై ఆడుతుండటం ప్రొటీస్‌కు కలిసి రానుంది.
భారత్: కోహ్లీ (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే/శ్రేయస్/విహారి, పంత్, అశ్విన్, శార్దూల్, షమీ, బుమ్రా, సిరాజ్/ఇషాంత్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్మ్,్ర పీటర్సన్, డసెన్, బవుమా, డికాక్, ముల్డర్, కేశవ్, రబడ, ఎంగ్డీ, ఒలివర్.
పచ్చికతో నిండి ఉన్న సెంచూరియన్ పిచ్‌పై తొలి రోజు నుంచే సీమర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉండగా.. మ్యాచ్ సాగుతున్నా కొద్ది మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు రోజులు మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ప్రమాదం పొంచి ఉండగా.. చివరి మూడు రోజులు బాగా ఎండ కాయనుంది.