Women’s World Cup | ప్రపంచకప్ విజేత భారత జట్టులోని ముగ్గురు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు ప్లేయర్లు భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించి భారత్ ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. అయితే, టోర్నీలో నిలకడగా రాణించిన ప్రతీకా రావల్‌కు మాత్రం జట్టులో ఐసీసీ చోటు ఇవ్వలేదు. అయితే, సెమీఫైనల్‌కు ముందు గాయం కారణంగా టోర్నీ నుంచి ప్రతీకాను తప్పించిన విషయం తెలిసిందే. అలాగే, రన్నరప్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు ప్లేయర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 54.25 సగటుతో 434 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై 109 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 80, ఇంగ్లండ్‌పై 88 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 58.40 సగటుతో 292 పరుగులు చేసింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 127 పరుగులు అజేయంగా నిలిచి.. టీమిండియా ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్‌పై ఆమె అజేయంగా 76 పరుగులు, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 24 పరుగులతో రాణించింది. ఇక దీప్తిశర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైంది. బ్యాట్‌తో 215 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించి 22 వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో 39 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల పడగొట్టింది. అంతే కాకుండా 58 పరుగులు చేసింది. దీప్తి అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను భారత జట్టు కట్టడి చేయగలిగింది. దక్షిణాఫ్రికా నుంచి లారా వోల్వార్డ్ (కెప్టెన్), మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు. వోల్వార్డ్ టర్నీలో 71.37 సగటుతో 571 పరుగుల చేసింది. వుమెన్స్ వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగుల రికార్డులను బ్రేక్ చేసింది.
స్మృతి మంధాన (భారత్)
వోల్వార్డ్ (కెప్టెన్-దక్షిణాఫ్రికా)
జెమిమా రోడ్రిగ్స్ (భారత్)
మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా)
ఆష్లీ గార్డ్నర్ (ఆస్ట్రేలియా)
దీప్తి శర్మ (భారత్)
అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా)
నాడిన్ డి క్లర్క్ (దక్షిణాఫ్రికా)
సిద్రా నవాజ్ (వికెట్ కీపర్-పాకిస్తాన్)
అలానా కింగ్ (ఆస్ట్రేలియా)
సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్)
12వ ప్లేయర్ : నాట్ స్కైవర్ బ్రంట్ (ఇంగ్లండ్)