ముంబై : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్(ఎంఐ) పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ గెలిచిన ముంబైకి టీ20 ఫార్మాట్లో ఇది 150వ విజయం. తద్వారా 20 ఓవర్ల క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఎంఐ కొత్త చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్‌తో పాటు చాంపియన్స్ టీ20 లీగ్ టోర్నీలలో కలుపుకుని ముంబై.. 273 మ్యాచ్‌లు ఆడి 150 గెలిచి 117 మ్యాచ్‌లలో ఓడింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. సూపర్ ఓవర్లలో ముంబై రెండింట్లో గెలిచి రెండు మ్యాచ్‌లలో ఓడింది. వాటిని విజయాలలో పరిగణనలోకి తీసుకోకుండానే 150 మ్యాచ్‌లను గెలుచుకుంది. ముంబై తర్వాత ఈ రికార్డు చెన్నై పేరిట (148) ఉంది. వాంఖడేలో ముంబైకి ఇది 50వ గెలుపు. ఐపీఎల్లో మరే జట్టుకూ సొంత మైదానంలో ఇలాంటి రికార్డు లేదు.