Virat Kohli | టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీకి విశ్వవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్నా బుడ్డోడి నుంచి ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్ల వరకు విరాట్‌ను అభిమానించే వారి సంఖ్య కోకొల్లలు. ఇక సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ ఫాలోయింగ్ చూస్తూ మైండ్ బ్లాక్ కావ్సాలిందే. సోషల్ మీడియాలో 340 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న విరాట్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలో అవుతున్న మూడో క్రీడాకారుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించగా.. ఒకవైపు దీనిపై తాజా, మాజీ క్రికెటర్లు స్పందిస్తుంటే.. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రైనీ మాత్రం విరాట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘నా స్నేహితుడు విరాట్ కోహ్లీ.. ఒలింపిక్స్‌లో భాగస్వామి కానున్నాడు. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రీడాకారుల్లో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. లెబ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ వంటి ఎంతో మంది క్రీడా దిగ్గజాల కంటే.. విరాట్ చాలా ముందున్నాడు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం చాలా సంతోషం’ అని పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. మరో ఐదేండ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్ వరకు విరాట్ కెరీర్ కొనసాగించకపోవచ్చని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం విరాట్ ఫిట్‌నెస్‌కు వంక పెట్టడానికి లేదని.. అతడు తప్పక ఒలింపిక్స్‌లో పాల్గొంటాడని అభిప్రాయపడుతున్నారు. క్రికెట్‌కు విరాట్ గ్లోబల్ అంబాసిడర్ అని అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.