US Open 2024 : ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో పతకాలు కొల్లగొట్టిన ముగ్గురు క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్(Grandslam) నుంచి నిష్క్రమించారు. విశ్వ క్రీడల్లో పోడియం మీద నిల్చున్న ముగ్గురిలో ఒక్కరు కూడా క్వార్టర్స్ చేరలేకపోయారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఇలా జరుగడం బహుశా ఇదే మొదటిసారి.
తొలుత రజత పతక విజేత కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) రెండో రౌండ్లోనే ఓటమి పాలవ్వగా.. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే స్వర్ణంతో చరిత్ర సృష్టించిన టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) సైతం పరాజయం పాలయ్యాడు. ఇక కాంస్య పతకంతో మెరిసిన లొరెంజో ముసెట్టి (Lorenzo Musetti) ఖేల్ కూడా మూడో రౌండ్లోనే ముగిసింది.
That moment for Alexei Popyrin 😤 pic.twitter.com/DbAMvn4rGJ
— US Open Tennis (@usopen) August 31, 2024
ప్రపంచ టెన్నిస్‌లో సంచలనాలకు కేరాఫ్ అయిన అల్కరాజ్ నిరుడు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్(Wimbledon 2024) టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. అదే ఊపులో ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ఈ యువకెరటం జకోవిచ్ ధాటికి నిలవలేకపోయాడు. టైటిల్ పోరులో కొదమసింహంలా గర్జించిన జకో.. కెరీర్లో తొలి ఒలింపిక్స్ పసిడిని దక్కించుకున్నాడు.
జకోవిచ్, అల్కరాజ్
ఫేవరేట్‌గా యూఎస్ ఓపెన్‌లో అడుగు పెట్టిన ఈ ఇద్దరూ అనూహ్యంగా క్వార్టర్స్ లోపే ఇంటిదారి పట్టారు. 74వ ర్యాంకర్ బొటిక్ చేతిలో అల్కరాజ్ బిత్తరపోగా.. ఆస్ట్రేలియా కెరటం అలెక్సీ పొపిరిన్ పట్టుదల ముందు జకోవిచ్ తలొగ్గాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అలెక్సీ 6-4, 6-4, 2-6, 6-4తో జకో జోరును అడ్డుకున్నాడు. ఇక పారిస్‌లో కంచు మోత మోగించిన లొరెంజో ముసెట్టి పోరాటానికి బ్రాండన్ నకషిమ చెక్ పెట్టాడు.