కీవ్: ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని(F-16 Fighter Jet) రష్యా కూల్చివేసింది. సోమవారం రెండు దేశాల మధ్య భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రష్యాకు చెందిన పాట్రియాట్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థ ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నాటో దళాలు.. ఉక్రెయిన్‌కు ఇటీవలే అందజేశాయి. వాస్తవానికి ఆ యుద్ధ విమానం అమెరికా తయారు చేస్తున్నది. సోమవారం రష్యా వందల సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. ఆ సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానం నేల కూలినట్లు ఉక్రెయిన్ ఎంపీ మారియానా బెజుగయా తెలిపారు.
శుత్రవులు చేసిన మిస్సైల్ దాడిలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలినట్లు ఉక్రెయిన్ మొదట అంగీకరించ లేదు. కానీ ఆ యుద్ధ విమాన పైలెట్.. నేల కూలడానికి ముందు మూడు రష్యన్ క్రూయిజ్ మిస్సైళ్లను, ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. భీకరమైన రష్యా మిస్సైళ్ల దాడి నుంచి ఉక్రెయిన్లను పైలెట్ ఒలెసీ కాపాడినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం ఈ ఘటన పట్ల ప్రకటన చేశారు. రష్యా డ్రోన్లు, మిస్సైళ్లను కౌంటర్ చేసేందుకు అమెరికాలో తయారైన ఎఫ్-16 విమానాలు వాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు సుమారు 65 ఎఫ్-16 యుద్ధ విమానాలను ఇవ్వాలని నాటో దళాలు గత ఏడాది నిర్ణయం తీసుకున్నాయి. ఎఫ్-16లతో పాటు పాట్రియాట్, నాసామ్స్ యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ కూడా ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి. ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోవడం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఎదురుదెబ్బే అవుతుంది.
అమెరికా తయారు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను కూల్చే పైలెట్లకు లక్షా 70 వేల డాలర్ల నజరానా ఇవ్వనున్నట్లు ఓ కంపెనీ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.