Indian Shooting : విశ్వ క్రీడల్లో రెండంకెల మార్క్ అందుకోలేకపోయిన భారత్ కొత్త కోచ్‌ల వేటలో పడింది. ఇప్పటికే బాక్సర్ల కోసం విదేశీ కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలెట్టిన ఒలింపిక్ సంఘం(IOA) తాజాగా షూటర్లకూ కూడా కొత్త కోచ్‌ను తేనుందని సమాచారం. అవును భారత షూటర్లకు కోచింగ్ ఇచ్చేందుకు ఒలింపిక్ మెడలిస్ట్ ఆసక్తి చూపిస్తున్నాడు.
బ్రిటన్‌కు చెందిన పీటర్ విల్సన్ (Peter Wilson)ఈ-మెయిల్ ద్వారా తన రెజ్యూమ్‌ను భారత షూటింగ్ సమాఖ్యకు పంపాడు. ఈ విషయాన్ని అతడే శనివారం స్వయంగా వెల్లడించాడు. ‘భారత రైఫిల్ సమాఖ్యకు నా సీవీని ఈమెయిల్ చేశా. వాళ్ల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లక్ష్యంగా భారత సీనియర్ షూటర్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఇక జూనియర్లకు వచ్చే 8 నుంచి 12 ఏండ్లు టార్గెట్‌గా శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నా. నా ఏకైక ఉద్దేశం విజయం సాధించడమే’ అని 37 ఏండ్ల పీటర్ ఓ ప్రకటనలో తెలిపాడు.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
ఒలింపిక్స్ పురుషుల డబుల్ ట్రాప్‌లో పీటర్ రెండు స్వర్ణాలు గెలుపొందాడు. ప్రస్తుతం కోచ్ అవతారమెత్తిన అతడు తమ దేశానికి చెందిన షూటర్లను విజేతలుగా మలిచాడు. పీటర్ ట్రైనింగ్‌లో రాటుదేలిన నాథన్ హేల్స్ పారిస్ తాజాగా ముగిసిన ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో మెరిశాడు.
ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ప్రతిసారి పతకాలతో మెరుస్తున్నారు. ఎథెన్స్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజతంతో అదరహో అనిపించగా.. బీజింగ్‌లో అభినవ్ బింద్రా (Abhinav Bindra) ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. లండన్‌లో గగన్ నారంగ్ కాంస్యం సాధించగా.. పారిస్‌లో మనను భాకర్ ఏకంగా రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించింది.
వ్యక్తిగత విభాగంలో స్వప్నిల్ కుసాలే (Swapnil Kusale) కంచు మోతతో షూటింగ్లో మెడల్స్ సంఖ్యను మూడుకు పెంచాడు. సౌరభ్ చౌదరీ, ఇషా సింగ్ వంటి షూటర్లు నిరాశపరిచినా లాస్ ఏంజెల్స్ లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.