న్యూఢిల్లీ / వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఆయన స్టోర్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. మృతుడ్ని 36 ఏళ్ల మైనాంక్ పటేల్‌గా గుర్తించారు. (Indian origin man shot dead in US) నార్త్ కరోలినాలో ఈ సంఘటన జరిగింది. 2580 ఎయిర్పోర్ట్ రోడ్లో టొబాకో హౌస్ పేరుతో కన్వీనియన్స్ స్టోర్‌ను పటేల్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం అతడి స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పటేల్‌ను రెండు హాస్పిటల్స్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.
కాగా, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఒక యువకుడు పటేల్‌పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. మైనర్ బాలుడ్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్టోర్‌లో దోపిడీ కోసమే పటేల్‌పై కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. పటేల్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కాల్పుల్లో పటేల్ మరణించిన విషయం తెలుసుకున్న అతడి కస్టమర్లు విచారం వ్యక్తం చేశారు. బుధవారం అతడి షాపు వద్ద నివాళి అర్పించారు. ‘మైక్’గా పిలుచుకునే పటేల్ ఉదారమైన, దయగల వ్యక్తి అని పేర్కొన్నారు. పటేల్ భార్య గర్భవతి కాగా, ఐదేళ్ల కుమార్తె కూడా ఉన్నది.