Sudan | యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంట్రల్ సూడాన్‌లోని సిన్నార్ రాష్ట్రంలో (Sinnar state) పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) జరిపిన కాల్పుల్లో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు పారామిలటరీ బలగాలు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆర్ఎస్ఎఫ్ కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా నివేదించింది.
‘సెంట్రల్ సూడాన్‌లో గల సిన్నార్ రాష్ట్రంలోని జల్కిని గ్రామంపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు గురిపెట్టాయి. గురువారం నుంచి గ్రామాన్ని చుట్టుముట్టి రక్తపాతం సృష్టించారు. గ్రామం నుంచి ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దీన్ని స్థానికులు ప్రతిఘటించారు. ఈ ఘటన మరణకాండకు దారితీసింది. ఆర్ఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మంది మరణించారు. చాలా మంది ప్రజలు గాయపడ్డారు’ అని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
కాగా, గతేడాది జూన్ నుంచి రాజధాని నగరం సింగాతోసహా సిన్నార్ రాష్ట్రంలోని పెద్ద భూభాగాలు ఆర్ఎస్ఎఫ్ బలగాల నియంత్రణలోనే ఉంటున్నాయి. ఇక తూర్పు సిన్నార్ ప్రాంతం సుడానీస్ సాయుధ దళాల నియంత్రణలో ఉంటోంది. అంతర్జాతీయ మైగ్రేషన్ సంస్థ ప్రకారం.. సిన్నార్ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకూ దాదాపు 7.25 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు.
కాగా, సైన్యం, పారామిలిటరీ మధ్య గతేడాది ఏప్రిల్ 15న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరులో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 16,650 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కోట్ల మంది ప్రజలు సూడాన్‌ను వదిలి వెళ్లిపోయారు. దాదాపు 2.2 మిలియన్ల మంది ప్రజలు పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read..
Cloudburst | హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన రోడ్లు
Vinesh Phogat | భారత్ చేరుకున్న వినేశ్ ఫోగాట్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్
Bridge Collapse | బీహార్‌లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి