Virat Kohli | విరాట్ కోహీ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లీ.. కష్టం వెనుక ఎన్నటికీ మర్చిపోలేని కన్నీటి సాగరం ఉంది. నేడు కోహ్లీ 34వ బర్త్ డే. ఈ సందర్భంగా కోహ్లీ జీవితంలో జరిగిన ఓ కీలక ఘట్టం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
అది 2006వ సంవత్సరం. డిసెంబర్ 19వ తేదీ. కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ 54 ఏండ్ల వయసులో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రేమ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రేమ్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
అదే సమయంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రంజీ ట్రోఫి జరుగుతుంది. ప్రేమ్ గుండెపోటుకు గురైన రోజే కర్ణాటకపై 40 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచాడు కోహ్లీ. ఆ రోజు రాత్రి తండ్రి గుండెపోటుతో మరణించినా.. కోహ్లీ మాత్రం తన గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. క్రికెట్‌పై తనకున్న మక్కువతో.. మ్యాచ్ ఆడుతున్నట్లు కోచ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తండ్రి శవాన్ని ఇంటి దగ్గర వదిలేసి స్టేడియానికి చేరుకున్న కోహ్లీ 90 పరుగులు చేసి ఢిల్లీ జట్టును ఫాలో ఆన్ నుంచి రక్షించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేమ మృతి చెందాడన్న విషయం సహకర క్రికెటర్లకు తెలిసింది. దీంతో కోహ్లీని క్రికెటర్లు ఓదార్చేందుకు ప్రయత్నించగా.. భావోద్వేగంతో డ్రెస్సింగ్ రూములోనే కోహ్లీ కుప్పకూలిపోయాడు.
ఆ రోజు పరుగుల వర్షం కురిపిస్తున్న సమయంలో కోహ్లీ సహచర క్రికెటర్‌తో కూడా సరిగా మాట్లాడలేదని, ముభావంగా ఉన్నాడని అతని సహచర క్రికెటర్లు చెప్పారు. తండ్రి అంటే కోహ్లీకి ఎంతో ఇష్టమని తెలిపారు. ఇవాళ కోహ్లీ బర్త్ డే నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను కూడా అభిమానులు నెమరేసుకుంటున్నారు. అలాంటి ఘటనలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.