బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ సంచలన ఆరోపణలు చేశాడు. అసలు పాక్ టీమ్‌లో ఫిట్నెస్ టెస్టు అనేదే నిర్వహించడం లేదని ఆరోపించాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఫీల్డ్‌లో పాక్ ఆటగాళ్ల ఆట చూశాక అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో దారుణ పరాజయం తర్వాత అక్రమ్ ఓ టీవీ ఛానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై నాకు ఆందోళనగా ఉంది. ప్రస్తుతం పాక్ టీమ్‌లో ఫిట్నెస్ టెస్టు లేదు. మిస్బా ఉల్ హక్ సారథిగా ఉన్నప్పుడు యో-యో టెస్టుతో ఇతర ఫిట్నెస్ టెస్టులను రెగ్యులర్‌గా నిర్వహించేవాళ్లు. ప్రొఫెషనల్ క్రికెటర్ తప్పకుండా నెలకు ఒకసారి అయినా ఫిట్నెస్ టెస్టులో పాల్గొనాలి. అలా చేయకుంటే మీకు ఇలాంటి ఫలితాలే (భారత్‌తో మ్యాచ్‌లో ఓటమిని ప్రస్తావిస్తూ) ఎదురవుతాయి..’అని అన్నాడు.
అంతేగాక అక్రమ్ పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్‌మెంట్‌పైనా విమర్శలు గుప్పించాడు. ‘గత మూడేండ్లలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు ఛైర్మన్లు మారారు. దీంతో ఆటగాళ్లలో కూడా అభద్రతాభావం పెరిగింది. తర్వాత సిరీస్‌లో మేం ఆడతామో లేదో అన్న భావన ఆటగాళ్లలో ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో 154-2గా ఉన్న స్కోరు ఉన్నఫళంగా 191 పరుగులకే ఆలౌట్ అవడం చాలా నిరాశపరిచింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా రెండ్రోజుల క్రితం భారత్ – పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 20 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ విజయంతో భారత్.. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఆధిక్యాన్ని 8-0కు పెంచుకుంది.