NZ vs PAK: పాకిస్తాన్ – న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం కారణంగా ఆగిన ఆట వాన ఆగిపోవడంతో తిరిగి మొదలైంది. కివీస్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో 21.3 ఓవర్ల వద్ద పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేయగా అదే సమయంలో వర్షం కురవడంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేశారు. కొద్దిసేపటి క్రితమే వర్షం ఆగిపోవడంతో అంపైర్లు ఆటను తిరిగి కొనసాగించడానికే మొగ్గుచూపారు.
పాక్ ఇన్నింగ్స్‌ను 41 ఓవర్లకు కుదించిన అంపైర్లు.. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే పాకిస్తాన్ గెలవాలంటే ఇంకా 19.3 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ 6.20 గంటలకు మొదలైంది. వర్షం వల్ల ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ (69 బంతుల్లో 106 నాటౌట్, 7 ఫోర్లు, 9 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (51 బంతుల్లో 47 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) లు క్రీజులో ఉన్నారు.