సెర్బియా స్టార్‌కు తొలిగిన అడ్డంకులు
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. బ్రిటన్‌లోకి అడుగుపెట్టాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సీఈవో సాల్లీ బోల్టన్ ప్రకటించింది. దీంతో జూన్ 27 నుంచి మొదలుకానున్న వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు జొకో దూరమైన విషయం తెలిసిందే. ఇదే కారణంతో మరికొన్ని టోర్నీల్లో కూడా గైర్హాజరయ్యాడు.
ఎట్టకేలకు వింబుల్డన్‌కు అనుమతి లభించడంతో జొకో మరోసారి టైటిల్ వేట సాగించనున్నాడు. మే 22 నుంచి మొదలుకానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా ఈ సెర్బియా స్టార్ తలపడే అవకాశం ఉంది. అతడు టైటిల్ సాధించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఫ్రెంచ్ ఓపెన్ డైరెక్టర్ అమెలీ మౌరెస్మో పేర్కొంది. కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు కీలక టోర్నీల్లో సెర్బియా స్టార్ జొకో బరిలోకి దిగనున్నాడు. అయితే ఆగస్టులో జరుగనున్న యూఎస్ ఓపెన్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటిస్తామని అమెరికా టెన్నిస్ సంఘం ప్రకటించింది. దీంతో ఈ టోర్నీలో జొకో పాల్గొనడం అనుమానంగా ఉంది.