e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home స్పోర్ట్స్ అర్ధశతాబ్దానికి ఒక్కడు

అర్ధశతాబ్దానికి ఒక్కడు

అర్ధశతాబ్దానికి ఒక్కడు
  • నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు రెండుసార్లు నెగ్గిన జొకోవిచ్‌
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సిట్సిపస్‌ పై జయభేరి

ప్రైజ్‌మనీ

  • విన్నర్‌: రూ.12.41 కోట్లు
  • రన్నరప్‌: రూ. 6.65 కోట్లు

మోడ్రన్‌ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రెండు సార్లు చేజిక్కించుకున్న తొలి ఆటగాడు నొవాక్‌. ఆస్ట్రేలియా ఆటగాడు రాడ్‌ లీవర్‌ (1969లో) చివరి సారిగా ఈ ఘనత సాధించాడు.

ఓపెన్‌ ఎరాలో దిగ్గజాలకే సాధ్యంకాని ఫీట్‌ను జోకోవిచ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో ఫెదరర్‌, నాదల్‌, ముర్రే వంటివాళ్లు ఆటను శాసించినా.. వారెవరికీ దక్కని అరుదైన రికార్డు జోకర్‌ సొంతమైంది. ఐదు దశాబ్దాల అనంతరం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను రెండేసి సార్లు ముద్దాడిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ చరిత్రకెక్కాడు. అచ్చొచ్చిన చోటే కాదు.. అనువుగాని చోట కూడా సత్తా చాటుకున్న సెర్బియా వీరుడు రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ పట్టాడు. దీంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ ఖాతాలో వేసుకున్న జొకో.. ఫెదరర్‌, నాదల్‌ (20 టైటిల్స్‌)కు అడుగుదూరంలో నిలిచాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన సిట్సిపస్‌ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు.

- Advertisement -

పారిస్‌: సెమీఫైనల్‌కు యాక్షన్‌ రీప్లేలా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ తుదిపోరులో మరోసారి జొకోవిచ్‌దే పైచేయి అయింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన అనంతరం కొదమసింహంలా విజృంభించిన జొకో రోలాండ్‌ గారోస్‌లో రెండో టైటిల్‌ పట్టడంతో పాటు.. కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6-7(6/8),2-6,6-3,6-2,6-4 తో ఐదో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపస్‌ (గ్రీస్‌)పై గెలుపొందాడు. 4 గంటలా 11 నిమిషాల పాటు సాగిన పోరులో 34 ఏండ్ల జొకోవిచ్‌ జోరు ముందు 22 ఏండ్ల సిట్సిపస్‌ నిలువలేకపోయాడు. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో సిట్సిపస్‌పై ఐదు సెట్‌ల పాటు పోరాడి నెగ్గిన జొకోవిచ్‌ ఈ సారి కూడా మొదటి రెండు సెట్‌లు కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయాడు. అయితే తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన సిట్సిపస్‌.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోలేకపోయాడు. అనవసర తప్పిదాలతో జొకోకు కోలుకునే అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి జూలు విదిల్చాక వెనుదిరిగి చూసుకోని జొకోవిచ్‌.. వరుసగా మూడు సెట్‌లు నెగ్గి మ్యాచ్‌ను తన పేరిట రాసుకున్నాడు. రెండు సెట్‌లు ఓటమి పాలయ్యాక మ్యాచ్‌ సొంతం చేసుకోవడం జొకోవిచ్‌కు ఇది ఆరోసారి.

జొకో జోరు

మట్టి కోర్టులో చెప్పుకోదగ్గ రికార్డు లేని జొకోవిచ్‌కు ఇది రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌. 2016లో తొలిసారి ఇక్కడ విజేతగా నిలిచిన జోకర్‌ మళ్లీ ఐదేండ్లకు విజయ బావుట ఎగురవేశాడు. నాదల్‌తో సెమీఫైనల్లో ఒక్క సెట్‌ చేజిక్కించుకునేందుకు గంటన్నరకు పైగా చెమటోడ్చిన జొకోవిచ్‌కు.. ఫైనల్లో తొలి సెట్‌లోనే అగ్ని పరీక్ష ఎదురైంది. డ్రాప్‌ షాట్లు, బ్యాక్‌ హ్యాండ్‌, నెట్‌ పాయింట్స్‌తో విరుచుకుపడిన సిట్సిపస్‌ జొకోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగడంతో సెర్బియా వీరుడు తొలి రెండు సెట్‌లు కోల్పోవాల్సి వచ్చింది. మూడో సెట్‌లో ప్రత్యర్థి బలాలను అంచనా వేసుకున్న జొకో.. క్రాస్‌ కోర్టు షాట్లతో విరుచుకుపడి సెట్‌ సొంతం చేసుకున్నాడు. అదే జోరులో నాలుగో సెట్‌లోనూ నెగ్గిన జోకర్‌.. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో తన అనుభవాన్నంతా రంగరించి ఫలితం సాధించాడు. ఓవరాల్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 5 ఏస్‌లు సంధిస్తే.. సిట్సిపస్‌ 14తో పైచేయి సాధించాడు. జొకో 3 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా.. సిట్సిపస్‌ 4 చేశాడు. జొకో 56 విన్నర్లు కొట్టగా.. సిట్సిపస్‌ 61తో ముందంజలో నిలిచినా.. అనవసర తప్పిదాలు ఎక్కువచేసిన గ్రీకు వీరుడికి ఓటమి తప్పలేదు.

క్రెజికోవా డబుల్‌ ధమాకా

అర్ధశతాబ్దానికి ఒక్కడు

మహిళల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ ఎగురేసుకుపోయిన చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ బార్బొరా క్రెజికోవా డబుల్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ క్రెజికోవా-సినియాకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 6-4, 6-2తో ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)-మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్ధశతాబ్దానికి ఒక్కడు
అర్ధశతాబ్దానికి ఒక్కడు
అర్ధశతాబ్దానికి ఒక్కడు

ట్రెండింగ్‌

Advertisement